Tuesday, April 7, 2020

31.03.2020కి ముందురోజు.... చందూగాడితో....

30.03.2020 ఉదయం 7.00.అలారం మోగగానే ఎప్పటిలా టపీమని కొట్టి- సినిమాల్లోలా క్లాక్‌ని కాదు మొబైల్‌ని (గడియారాన్నని నేను చెప్పినా మీరు నమ్మరు)- మళ్ళీ ముసుగుతన్ని పడుకోగానే అలారం కంటే గట్టిగా మోగింది కళ గొంతు లేవమని.  "కళ" అంటే మా ఆవిడ.  కళ కలైతే బాగుండు కాసేపు పడుకొనేవాడ్ని అనుకొన్నానో లేదో మళ్ళీ మోగింది మైకులు మింగిన గొంతు లేవమని. నెనులిక్కిపడి లేచి కూర్చున్నాక, "ఈ రోజు మన్‌డే. రైతుబజార్ 11.00 వరకే క్లోస్ చేస్తారట మైక్‌లో అనౌన్స్ చేసారు", అని నిదానంగా చెప్పింది కళ. వాయిస్ మాడ్యులేషన్ అని ఏదో అంటారే అది నేర్చుకోవాలంటే కళ కరెక్ట్. ఆక్ట్యువల్లి కళానే కరెక్ట్. నిద్రలేపడానికి విన్న గొంతు తర్వాత విన్న గొంతు కళావే అంటే నమ్మలేం. పక్కకి తిరిగి చూస్తే పిల్లలిద్దరూ లేచి మంచంలో అలా షాక్‌కొట్టినవాళ్ళలా కదలకుండా కుర్చొన్నారు. ఒకనిమిషం తర్వాత చిన్నమ్మాయి నావైపు చూసి,"డాడీ! పిడుగు పడిందా?" అని అడిగింది. దానికి నేను జవాబు చెప్పేలోపే పెద్దమ్మాయి తన ప్రావీణ్యం ప్రదర్శించింది. "సమ్మర్‌లో పిడుగేంటే. మన స్ట్రీట్‌లో వుండే పెద్ద బ్రవున్‌కుక్క అరిచిందనుకుంటా", అని అంది. దానికి నాకు కిసుక్కున నవ్వొచ్చింది.  గట్టిగా నవ్వలేను కళ పక్కనేవుంది. ఎందుకైనా మంచిదని, " అదేంకాదమ్మా, అమ్మ చెయ్యి తగిలి ఎదో గిన్నె కిందపడింది" అని అన్నాను. నేను సైలెంట్‌గా అక్కడనుంచి జారుకొని రైతుబజార్‌కెళ్ళడానికి రెడీ అయిపోయా. టైం 8.30. ఇంతలో చందూగాడి ఫోన్, "ఎరా మామా రైతుబజార్కెల్దాం రెడీ అవ్", అన్నాడు. ఈ విపత్కర టైంలో చందూగాడితో రైతుబజార్. ఊహించుకొంటేనే ఒల్లు జలదరించింది. నేను రానురా అనేలోపే అవతలనుంచి చందూగాడు,"6.00కి ఫోన్ చేస్తే కళ లిఫ్ట్ చేసిందిరా. నేనే చెప్పా రైతుబజార్ 11.00కి క్లోజ్అని. నువ్వు రెడీనా?", అని అన్నాడు. "ఆల్మోస్ట్", అని రిప్లై ఇచ్చేలోపే, "నేను కింద వెయ్ట్ చేస్తున్నా", అని ఫోన్ పెట్టేసాడు.

"అయితే ఈ పిడుగుపాటు.... సారీ సారీ....బ్రవున్‌కుక్క మొరగడం.... ఐ మీన్ కళ అరవడం వెనక చందూగాడి కుట్ర ఉందన్నమాట", అని మనసులో అనుకుంటూ సెకండ్ ఫ్లోర్ నుండి దిగుతున్న నాకు దడేల్ మని తలుపేసిన శబ్దం విని హార్ట్ఎటాక్ వచ్చినంతపనైంది. ఫస్ట్ ఫ్లోర్లో మెట్ల పక్కన కిటికీలోనుంచి అరుపులు వినపడుతున్నాయి, "ఎంటండీ అంత నిర్లక్ష్యం. మాస్క్‌లేకుండా తిరుగుతున్నారు. మాకెమన్నా అయితే" అని నా వైపు చూస్తూ అరుస్తుంది ఒక బ్రహ్మరాక్షసి. తేరుకొని చూసినా కూడా ఆ పోర్షన్‌లో ఉండే పంకజంగారిలా లేదు...విరబోసుకొన్న చింపిరి జుట్టు, గుడ్లెల్లబెట్టి అరుపులు...పక్కా బ్రహ్మరాక్షసే! వెంటనే భయంతో గజగజ వొణుకుతూ కెవ్వుమని కేకెసాను. అప్పుడా బ్రహ్మరాక్షసి కొంచెం జుట్టు సరిచేసుకొంటూ కీచుశబ్దంతో తలుపుతీసి చీకటిగదిలోంచి బయటకొచ్చింది. నేను బిక్కచచ్చిపోయి కళ్ళుమూసుకొని మెట్లపైన కూలబడ్డాను. "నేనేమైనా బ్రహ్మరాక్షసినా అలా వొణుకుతున్నారు", అని బ్రహ్మరాక్షసి మాట్లాడుతూంటే లొపలనుంచి, "ఎంటే పంకజం రాక్షసిలా ఆ అరుపులు",  అని సుబ్బారావ్‌గారి గొంతువిని ఒక కన్ను తెరిచిచూసా. ఎదురుగ బ్రహ్మరాక్షసిలా పంకజంగారు పళ్ళు పటపటా కొరుకుతున్నారు. ఎందుకైనా మంచిదని జేబులో కర్చీఫ్ తీసి మొహానికి కట్టుకున్నా. "మీరు ముందే ఈ కర్చీఫ్ కట్టుకొని వచ్చుంటే నేనింత భయపడి చచ్చేదాన్ని కాదు, ఇప్పుడు జరగబోయేది జరిగేది కాదు" అంటూ విసురుగా తలుపు దడేల్‌మని వేసి లోనికెల్లిపోయారు బ్రహ్మరాక్షసి....సారీ.... పంకజంగారు. నేను మెట్లు దిగుతుంటే, "నన్ను రాక్షసి అంటావా?", అని పంకజంగారి వాయిస్ వినపడింది. వెంటనే దీపావళి టపాసుల శబ్దం, ఆ వెంటనే కుక్క కుయ్ కుయ్ మనే శబ్దాలు. నాకర్థమయింది సుబ్బారావ్‌గారికి లాక్‌డవున్ ఇంకొన్నిరోజులు ఎక్స్‌టెండ్ అయ్యిందని. 

ఈ వైరస్ ఏమోగాని లిఫ్ట్ లేక మెట్లు దిగి ఎక్కడం నా చావుకొచ్చింది అని నేననుకొంటూ కిందకి రాగానే, కాకీ డ్రెస్స్‌లో ఒకడొచ్చి, "ఒక వందివ్వండి సార్" అన్నాడు. పొద్దున్నే పోలీసోళ్ళు ఏకంగా ఇళ్లదెగ్గరే వసూళ్ళు స్టార్ట్ చేసారు ఛీ అనుకొని "నేను డబ్బులెందుకివ్వాలి? లాక్‌డవున్ మార్నింగ్ 6 వరకే కదా" అని అన్నాను. అందుకు ఆ పోలీసు, "సార్ మీ కార్ తుడిచిన డబ్బులు పోయిన్నెలవి ఇయ్యలేద్సార్. మేడంగారినడిగితే చిల్లరలేవన్నారు. పదిరోజులైంది సార్. ఏదో వైరస్ అని పైకి రావొద్దన్నారు. మీరియ్యండి సార్", అని అన్నాడు.వార్నియమ్మ నా పెళ్లాం ఏకంగ పోలీసొడ్తోనే కార్ తుడిపిస్తుంది అని అవాక్కై నేను, "రైతుబజార్ నుంచి తిరిగొచ్చాక ఇస్తా. వుంటావా?" అన్నాను. వాడు సరే సార్ అన్నాడు. 

నేను బయటకి రాగానే నా వెనకే ఒకడు నల్ల టోపి, నల్ల కళ్లద్దాలు, నల్ల ముసుగు, నల్ల డ్రెస్స్‌లో నల్ల మూటొకటి భుజానికేసుకొని మా అపార్ట్మెంట్‌లో నుంచి వేగంగా బయటకొచ్చాడు. వెంటనే నా బుర్రకి చిన్నప్పుడు జ్యోతి మాసపత్రికలో మల్లిక్ వేసిన దొంగ కార్టూన్ గుర్తొచ్చి డవుట్‌లేదు వీడు దొంగే అనుకొని దొంగా దొంగా అని అరిచా. అప్పుడు ఇందాక నా దెగ్గర వందడిగిన పోలీసొడొచ్చి, "పోన్లేండి సార్ పాపం. అసలే లాక్‌డవున్. ఐదింటికల్ల వాడి పని ముగించుకోవాలి", అని సర్దిచెప్పాడు. వార్నాయనోయ్ దొంగా పోలీస్ కుమ్మక్కయ్యారనుకొని ఇంకా గట్టిగా దొంగా దొంగా అని ఆ నల్లముసుగోడివైపు చేయి చూపిస్తూ అరిచా. నా అరుపులు విని బాల్కనీలోకొచ్చిన మా అపార్ట్మెంట్‌వాళ్ళు నన్ను పిచ్చొడ్ని చూసినట్టు చూసి లోనికెళ్లిపోయారు. ఆ నల్లముసుగోడు పోతూ పోతూ నాకెదురుగా బైక్‌మీద వున్న ఇంకో ముసుగోడికి చేయివూపి వెళ్లాడు. వెంటనే నా ఎదురుగావున్న వేరే ముసుగోడు నావైపు రావడం మొదలెట్టాడు. నాకు వణుకు మొదలైంది. భయంతో మళ్లీ దొంగా దొంగా అని నాకెదురుగా వస్తున్న ముసుగోడ్ని చూసి అరిచా. వాడు నా దెగ్గరికొచ్చి, "ఆపరా మామా నీ జోక్స్" అన్నాడు. "ఎవడ్రా నీకు మామ" అన్నాన్నేను. "సిగ్గులేదు నీకు, దొంగల్తో చేతులుకలిపావ్" అని నేను పక్కనున్న పోలీసోడ్ని తిడుతుంటే నా ఎదురుగున్న ముసుగోడు మాస్క్‌తీసేసి నేన్రా చందూని అన్నాడు.
  "ఎందిరా ఈ వేషం?" అని నేనడిగితే,
"వైరస్ నుండి ప్రొటెక్షన్ మామా" అంటూ జేబులోనుంచి సానిటైజర్ తీసి నా చేతులుజాపమన్నాడు చందూగాడు. 
నేను "మరి ఆ నల్లముసుగుదొంగ నీకు చేతులూపి సిగ్నల్ ఇచ్చాడేంట్రా?" అంటే
"వాడు దొంగేంట్రా. మున్సిపాలిటీవాడు చెత్త తీసుకెల్లడానికి వొచ్చాడు. వైరస్ నుండి ప్రొటెక్షన్ కోసం నేనే వాడికవ్వన్నీ ఇచ్చా. అందుకే గౌరవంగా నాకు నమస్తే అని చెయ్యూపాడు" అన్నాడు చందూ.
నేను: సర్లేగాని ఒక వందుంటే ఇవ్వు ఆ పోలీసొడికివ్వాలి.ప్రతినెల నా కార్ తుడవడానికి కళ వాడ్ని పెట్టింది.
చందూ: వాడు పోలీస్ ఎందిరా.   వాడు మీ వాచ్‌మాన్ హనుమంతుగాడు.
నేను: హనుమంతుగాడు లుంగీబనీన్‌లో కదరా వుండేది. కాకీ డ్రెస్స్ ఏంది?
చందూ: అందుకేరా పొద్దున్నే లేవమనేది. తొమ్మిదింటికి లేచి నీ మొహంకూడ నువ్వు అద్దంలో చూసుకోకుండ ఆఫీస్‌కి ఉరికితే ఇట్లే ఉంటది. నువ్వు చెప్పిన హనుమంతుగాడి డ్రెస్స్ సాయంత్రం పెగ్గు పడ్డాక. రోజు పొద్దున్నే వాడు ఇదే కాకీ డ్రెస్స్ గెటప్‌లో వుంటాడు. సరే పద 9 అయ్యింది.

రైతుబజార్ వైపు ఇద్దరం వెళ్తూ, 
నేను: మొగోడైన హనుమంతుగాడు ట్రింగా తయారైతేనే గుర్తుపట్టలేకపోయారా. అలాంటిది పొద్దున్నే ఏ మేకప్‌లేని పంకజంగారిని చూసి...జడుసుకున్న.
చందూ: పద పద లేట్అవుతుంది. బైక్ నువ్వు నడుపు. నేను వెనక కూర్చుంటా.
నేను బైక్ స్టార్ట్ చేస్తూ, "ఎంట్రా ఈ గెటప్. ఫుల్ ప్లాస్టిక్ సూట్, గాగుల్స్, ఇంతెండలో గంబూట్స్ (మోకాళ్లవరకుండే షూస్), గ్లోవ్స్, మాస్క్, జేబులో సానిటైజర్...." అన్నాను.
చందూ: ఒరేయ్! నువ్వసలు ఏదైన వాట్సప్ గ్రూప్‌లో ఉన్నావారా? ఎంత భయంకరమైన మెసేజ్‌లో చూస్తే తెలుస్తది నీకు.  వైరస్ నుండి ప్రొటెక్షన్ మామా. నువ్వు మొకానికి కర్చీఫ్ కట్టి బండి తోలు జల్దీ.

పిచ్చాపాటీ మాట్లాడుతూ కొంత దూరం వెళ్లాక మమ్మల్ని పోలిసోల్లాపిన్రు. 
పోలీస్: యాడికోయ్ బయల్దేరిన్రు?
నేను: రైతుబజార్కి సార్
ఇంకో పోలీస్: నిజంజెప్పు నీ యనకోడికి కరోనా నా? ఏందాడు కిందనుంచి పైదాక కనపడకుండ కప్పుకొన్నడు?
నేను: లేద్సార్. వాడికి కొంచెం జాగ్రత్తలెక్కువ.
లేడీ పోలీస్: సార్, మా కాల్నీల ఒకనికి కరోనా వత్తే గిలాంటి డ్రెస్సే తొడిగి అంబులెన్స్‌ల తోల్కబోయిన్రు సార్.
ముందొక 'సార్' వెనకొక 'సార్' పెట్టి లేడీ పోలీస్ వివరించేసరికి పక్కనేవున్న బొర్రమీసాల పోలీస్‌కి అంకుశంలో రాజశేఖర్ పూనాడు. తక్షణం పొట్ట లోపలికి బిగబట్టి, చాతివుబ్బించి, లాటీ తిప్పుతూ, "ఒరేయ్ నువ్వు దిగరా ఫుల్‌సూటు" అని చందూగాడి వైపు చూస్తూ అన్నాడు. చందూగాడు దిగకుండ బిగబట్టుకొని అలానే కూర్చున్నాడు. బొర్రమీసాల పోలీస్ గుడ్లురిమి చూస్తుంటే....
నేను, " ఒరేయ్ చందూగా దిగరా. నువ్వు నీ ఎదవ వాట్సాప్ గ్రూపుల్లో పోలీసొళ్లు టీ20 ఆడుకొనేది కూడా చూసుంటవ్ కదా. దిగరా సామీ" అని గుసగుస రుసరుసలాడాను. ఎట్టకేలకు చందూగాడు బండిదిగి సైడ్‌కి కట్టెలాగా నిల్చున్నాడు. నేను బండి పక్కనపెట్టి చందూగాడి దెగ్గరకు పోతావుంటే,
 బొర్రమీసాల అంకుశం, "ఆగాగు బుద్ధుందారా నీకు? వానికి దగ్గరగపోకు, చస్తవ్" అన్నాడు. 
నేను దూరంనుంచే,"ఒరేయ్ చందూగా, ఇందాక మా ఇంటిదెగ్గర ఫుల్ జోష్‌లో నాకు జ్ఞానబోధ చేసినవ్ కదరా. ఇప్పుడేందిరా పోలిసోళ్లని చూస్తే బిగుసకపోయినవ్" అన్నాను.
 చందూ, "నీకు తెలుసుకదరా మామ ఈ పోలీసోళ్లకి ఎంతచెప్పినా బుర్రకెక్కదని. నువ్వే ఏదో ఒకటి చేయ్" అని నన్ను టీ20కి పంపే ప్లాన్‌ చేసిండు చందూగాడు.
చేసేదేమిలేక నేను మెల్లెగ మమ్మల్ని ఆపిన ఇద్దరు పోలీసోళ్లదెగ్గరికి పోయి,"సార్ వాడు నేను ఇద్దరం మీలాగ గవర్నమెంట్ ఎంప్లాయిస్సే సార్. మొన్న మా ఆఫీస్లో ఒకడ్ని పోలీసోళ్లు ఇట్లనే బండాపి కొడితే వాడు బీ పీ పెరిగిపోయి పడిపోయిండు సార్.... తర్వాత".... అని చెప్తుంటే నన్ను మధ్యలోనే కట్‌చేసి, ఇంకో పోలీస్, "...ఆ తర్వాత ఎమైంది చెప్పు చెప్పు. నాకు బీ పీ పెరుగుతంది. చెప్పు తమ్మీ" అని సస్పెన్స్ త్రిల్లర్ వింటునట్టు ఫేస్ పెట్టాడు. నేను, "తర్వాత మావోడ్ని ఆ పోలీసోళ్లే హాస్పటల్‌కి తీసుకుపోయి మొత్తం సెట్ అయ్యాక ఇంటికి దిగబెట్టిన్రు సార్" అన్నాను. "తర్వాత ఎమైంది తమ్మీ? మా పోలీసోళ్లని సస్పెండ్ ఏమైన చేసిన్రా?" అని తెగ ఉత్కంటతో అడిగిండు "ఇంకో పోలీస్".
నేను: " లేదు సార్. మావోడు వాడే బీ పీ డవునయి పడ్డ అని చెప్పిండు. ఇక అంతటితో ఆ గొడవ ముగిసింది" అని అన్నాను. ఇదంతా పక్కనుంచి విన్న లేడీ పోలీస్ అంకుశంగాడి దెగ్గరికిపోయి, "సార్ వాళ్లు సర్కారోల్లే సార్. పాపం భయపడ్తన్రు సార్" అని చెప్పింది. మళ్లీ 'సార్' 'సార్' అని వివరించిన మహిళ రక్షకభటురాలి వివరణ విని అంకుశంగాడిలోకి సల్మాన్‌ఖాన్ దబాంగ్ రూపంలో ప్రవేశించినట్లున్నాడు. చొక్కా రెండు గుండీలు విప్పి సరదాగవున్నట్లు ఫేస్‌పెట్టి,"ఏయ్ బాబు నువ్విక్కడ టెంట్‌లో కూర్చో" అని నాతో అన్నాడు. అదివిని చందూగాడు టెంట్‌వైపు వస్తుంటే, బొర్రమీసాల సల్మాన్, "ఒరే డీ కే బోసు, నిన్నుకాదురా. నువ్వు అక్కడే నీవెనకున్న  బండమీద కూసో" అని కసిరాడు. "బాబు వాడి టెంపా...టెంపా..." అని నోరుతిరగక సల్మాన్ కుస్తీపడుతుంటే, నేను, "టెంపరేచర్ సార్" అనగానే, "ఆ.... ఆ.... అదే చూసి పంపిస్తాం. ఇప్పుడే ఫోన్‌చేశా. మా హోంగార్డ్ అదే అది...ఆ థర్మల్ గన్ తీసుకొని వస్తున్నాడు. అందాక కూర్చోండి" అన్నాడు. చేసేదేంలేక అలా కూర్చుండిపోయా. టైం పది. అయినా సుర్రుమనే ఎర్రని ఎండ. టెంటుకింద తలకాయ్....ఆ తలకాయ్‌లో తలంపులు....ఒక 15 ఇయర్స్ వెనక్కి పోయాయి. 

అప్పుడే కొత్తగా దేశంకాని దేశంలో నా  సెకండ్ ఫుల్‌టైం జాబ్ మొదలుపెట్టాను. ఆక్లాండ్ నుండి పామర్స్టన్‌నార్త్(సింపుల్‌గా "పి యన్") అనే టవున్‌కి వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో మనకొక క్రష్ ఉండేది.... పేరు డెబ్బీ. (దొబ్బేయ్ కాదు). "పి యన్ లో చాలా బోరింగ్. కాని అక్కడ స్కైడైవింగ్ మాత్రం ఫేమస్. కాని చేయాలంటే గట్స్‌వుండాలి" అని చెప్పింది డెబ్బీ. ఇక మనలో సాహాసవీరుడు నిద్రలేచాడు. ఆక్లాండ్ టూ పి యన్,  ఏడా స్ట్రీట్- 516 కిలోమీటర్లు 4 1/2 గంటల్లో చేరుకొన్నాను. తర్వాత గిఫ్ట్‌గా 100 డాలర్ల స్పీడింగ్ టికెట్ వచ్చిందనుకోండీ...అది వేరే విషయం. డిసెంబర్ 16, 2006 శనివారం సెలవు....నాలోని సాహాసవీరుడు స్కైడైవింగ్‌కి సై అంటున్నాడు. ఉదయం పది, 200 డాలర్లు స్కైడైవింగ్ టికెట్, 50 డాలర్లు లైవ్ వీడియో రికార్డింగ్! ఫీజ్ కట్టి కుతూహలంగా నిరీక్షణ. మనసులోనే తెగ సంబరం. వీడియో తీసి డెబ్బీకి చూపి ఇంప్రెస్‌చేసి గట్స్‌వున్నాయ్ అని ప్రూవ్ చేసికొంటే పడిపోద్దని గట్టి నమ్మకం. "గిడ్డేయ్ మైట్", ఆన్న గొంతువిని ఊహలలోకంనుండి ఉలిక్కిపడి, "గిడ్డేయ్" అని విష్‌చేసా. ఎదురుగా నా స్కైడైవింగ్ ఇన్స్‌ట్రక్‌టర్ కీత్ బెన్నెట్....నాతో కొన్ని పేపర్ల మీద సంతకం చేయించుకొన్నాడు. "కం" అని నన్ను ఒక చిన్న విమానం దగ్గరికి తీసుకుపోయి, కిందనుంచి, పైనుంచి, నిలువుగా, అడ్డంగా కొన్ని బెల్ట్లు చుట్టి కీత్‌గాడు నన్ను వాడికి కట్టేసుకొని ఫ్లైట్ఎక్కమన్నాడు. ఆ కీత్ దు**తుగాడు బరువంతా నా మీద వేసి, "ఐ బిలీవ్ ఐ కన్ ఫ్లయియ్...." అని బర్రెగొంతుతో పాడుతూ, "స్టాండ్ హియర్" అని డోర్ పక్కన హ్యాండిల్ పట్టుకొని నిల్చోమన్నాడు. కీత్‌గాడు ఒక చేత్తో రికార్డింగ్ కెమేరా పట్టుకొన్నాడు. విమానం గాల్లోకి లేచింది. దాంతోపాటు నేను నా వీపుమీద దున్న కూడా. నాకు టెన్షన్ పెరుగుతుంది. బాగా పైకెగిరాక, "ఇప్పుడు కిందకి దూకు" అని అరిచాడు కీత్. కళ్ళు తెరిచిచూస్తే నా గుండెకాయ గొంతులోకొచ్చింది. 100 కిలోల కీత్‌గాడ్ని సైతం వెనక్కితోసి అక్కడే వుండిపోయా. అప్పుడు కీత్‌గాడు వెనక్కి తిరిగి స్లోగా డోర్‌దాకా జాయింట్‌గా నన్ను తీసుకెళ్లి, "ఏం భయపడకు, నేను వెనక్కి దూకుతాను, నువ్వు నాకు ఎటాచ్అయ్యున్నావ్ కదా హాయిగా ఆకాశంవైపు చూసుకో వెల్లకిలా" అంటూ జంప్ చేసాడు. నేను వాడిపైన ఒక్క క్షణమే...."మనం ముందుకు తిరగకపోతే ఎవ్వరికీ అందనంతపైకి పోతాం" అని జోకులేస్తూ వెకిలినవ్వు నవ్వుతున్నాడు. సడన్‌గ ముందుకు తిరిగాం. గాలి ఫోర్స్‌కి ,చలికి మొహం మొద్దుబారిపోయింది. కీత్‌గాడు కెమేరా వైపు చూడమని అరుస్తున్నాడు. నేను ధైర్యం చేసి చూస్తున్నా. మనసులో మాత్రం బతికుంటేచాలు అనుకొన్నా. "పారాషూట్ ఓపెన్ అవ్వట్లేదు" అని కీత్‌గాడు గాడిదకంటే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అంత చలిగాలిలో కూడా నాకు తడిచిపోయింది (చమటతో). అసలే కిందపడి చావబోతుంటే కీత్‌గాడు నాపైన.... కెమేరా అంతే పట్టుకొన్నాడు. నేను నానా ప్రార్థనలు అరుపులు ఏడుపులు....షాక్‌కొట్టినట్లు సడెన్‌గా గాల్లోకి లేచాం. కీత్‌గాడు వెకిలి నవ్వులు. "ఐ గాట్ యూ బడ్డీ..." అని వికృతానందం. పారాషూట్‌తో హాయిగా దిగుతున్నాం కాని ఎంజాయ్ చేసే మూడ్‌లో లేను. ఈ దున్నగాడి కుల్లు ప్రాంక్‌కి నా పాపాలన్నీ 70 యం యం స్క్రీన్ మీద నా కళ్ళెదుట కనబడ్డాయి. కిందకి దిగి ఆ శాడిస్ట్ బండ కీత్‌గాడ్ని ఒక తోపుతోసి వీడియోలో నాలోని సాహాసవీరుడు ఎంత దారుణంగా.....అంటే వీడియో చూస్తేగాని తెలియదు మీకు ఎంత భయంకరంగా భయపడ్డానో. ఇక ఇదిగాని డెబ్బీ చూస్తే మొదటికే దెబ్బైపోద్ది అని కీత్‌గాడ్ని ప్రపంచంలో వున్న బూతులన్ని తిట్టిపోసాను. 

"అరేయ్ పదరా పోదాం" అని చందూగాడు అనగానే ఈ లోకంలోకి వచ్చా. "ఏమైందిరా? వదిలేసారా?" అని అడిగా.  "అవున్రా అంతా పాసిటివ్" అన్నాడు చందూ. "పాసిటివ్వా?" అని దూరం జరుగుతున్న నన్నుచూసి వెంటనే చందూగాడు, "కరోనా పాసిటివ్ కాదురా. మనకంతా మంచే జరిగిందని. టెంపరేచర్ నార్మల్. వెళిపోమన్నారు" అన్నాడు. "నీ భాష తగలేయ్య, దరిద్రుడా...ఏం లేదనొచ్చుగా" అంటూ నేను వాడు బైకెక్కాం. ఇంతకి నేను ఆ స్కైడైవింగ్ ఎపిసోడ్ ఎందుకు చెప్పానంటే ప్రస్తుతం బైక్ వెనక కూర్చున్న చందూగాడు ఆ కీత్‌గాడికి తాతలాంటోడు. టైం 11:15, ఎలాగు రైతుబజార్ క్లోజ్ కాబట్టి కళాతో తిట్లు తింటానికి మెంటల్‌గా ప్రిపేరై నేను బైక్ వెనక్కి తిప్పబోయా. "అరేయ్ రైతుబజార్ ఓపెనేవుందిరా పోనీయ్" అన్నాడు చందూ. 
నేను: నువ్వేకదరా యెనౌన్స్ చేసారు 11 వరకే అని చెప్పావ్.
చందూ: అది నేను దిల్‌షుఖ్‌నగర్ ఆఫీస్‌లో వున్నప్పుడు అక్కడ ఎనౌన్స్ చేసార్రా. మన హబ్సిగూడాలో కూడా అలానే అనుకొన్నా. నేను ఫీల్అవుతుంటే ఆ లేడి పోలీస్ చెప్పింది మనేరియాలో సాయంత్రం 5 వరకు వుంటుందని. 
నేను: @#%$*** దిమ్మతిరిగిందిరా మామా నీ అమోఘమైన మేధస్సుకి. దయచేసి నువ్వు నీ కూరగాయలు కొనుక్కో. నేను నావి కొనుక్కొంటా. నీ షాపింగ్ అయ్యాక ఫోన్ చెయ్యి, మనం రైతుబజార్ మేయిన్‌గేట్ దగ్గర కలుద్దాం. బైక్ దిగ్గానే నువ్వు నాకు కనపడొద్దు నేను నీకు కనపడను. ఓకే నా?   
చందూ: ఎందుకురా మామా అంత కోపం? సరే అట్లే చేద్దాం.   

రైతుబజార్‌లోకి వచ్చాం. బైక్ స్టాండేసి ఎవరిదారినవారు పోయాం. కూరగాయల ధరలు మండుతున్నాయ్. మండే సూర్యుడు కూడా కాంపిటీషన్ తట్టుకోలేక చల్లబడ్డాడు. తెచ్చిన సంచి సగం కూడా నిండలేదు 500 రూపాయలెగిరిపోయాయి. జనాలు కాళ్ళకి చక్రాలు కట్టుకొన్నట్టు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఎక్కువగా లేడీస్. వీళ్ళ భాదేందని దగ్గరికెళ్లి చూస్తే.... కాదు.... వింటే .... ప్రతీ షాప్‌లో "ఎంత?" అని అడగటం బేరమాడటం. తూ జీవితం అనుకొన్న. ఒక షాప్ దగ్గరనుంచి జనాలు పరుగులుపెట్టుకొంటూ బయటకి పోయారు. చివరికి షాప్‌వాడు కూడా. ఎదో గలాటా అనుకొని త్వరగా వెళ్తే బెటర్ అని చందూగాడికి ఫోన్‌చేద్దామనుకొన్న. అంతలో వాడే కాల్‌చేసాడు. "మేయిన్‌గేట్ దగ్గరున్న వచ్చేయ్‌రా మామా" అన్నాడు. టైం 4:00. త్వరగా వెళ్లాలి అని బయల్దేరా. చందూగాడు చెయ్యూపుతున్నాడు. వాడి సంచినిండా కూరగాయలే. "ఏరా, ఎన్ని లక్షల కూరలు కొన్నావ్?" అన్నాను. 
చందూ: జస్ట్ 30 రూపీస్ రా.
నేను: హవులేగానిలెక్క కనపడుతున్నాన్‌బే. సరిగ్గ చెప్పు. 
చందూ: నిజంరా మామ. పావుకిలో మెరపకాయలడిగా. 30 రూపీస్ అంటే ఇచ్చాను. నా గెటప్ చూసి పక్కనున్న ఒక ఆంటీ "కరోనా వచ్చినోళ్లకి ఇట్లాంటి సూటే వేసి తీసుకుపోతున్నారు. నేను టీవీలో చూశా" అని పక్కన ఇంకో ఆంటీతో అందిరా.
నేను: అయితే....
చందూ: దానికి నేను జోక్‌గా "నేను ఇప్పుడే డిశ్చార్జై వస్తునా. ఇంటికి పోతూ పోతూ కూరలు తీసుకెళ్దామని ఆగాను" అని ఒక తుమ్ము తుమ్ముదామని రెండుచేతులు దగ్గరకుపెట్టుకొని ఫోజ్ ఇచ్చా. తుమ్మకముందే జనాలు పరుగు. షాప్‌వాడ్ని కూరలిచ్చి పోరా అంటే "అన్నీ తీసుకోండి సార్, బతికుంటే కలుద్దాం " అని వురికిండు. పదరా నువ్వూ తీసుకుందువుగాని. 
నేను: తూ.... నీ యబ్బ! ఏ పోలీసోడో వొచ్చి నిన్ను, నీతో వున్నందుకు నన్ను టీ20 ఆడుకొని బొక్కలో వెయ్యకముందే పోదాం పద. 
చందూ: ఓరీ పిచ్చి సుధీర్‌గా, ఎవడైనా నా గురించి కంప్లైంట్ చేస్తే మన కే సి ఆర్ సారు రైతుబజార్‌లో వున్న ప్రతీఒక్కడిని క్వారన్‌టైన్ అంటాడు. అందుకే అందరు చప్పుడుచేయకుండా మాయమయ్యారు చూసావా. ఆ పక్క షాప్ చూడు, అక్కడ జనాల్ని చూడు. ఓన్లీ నా మాటలువిన్నవారే జంపైయ్యారు. మిగతావారంతా రైతుబజార్‌కి రాజుల్లా తిరుగుతున్నారు చూడు.
వీడిలాంటి తింగరోడు ఎవ్వడన్నా కంప్లైంట్ ఇస్తే...."కూరగాయలకోసం కరోనా నాటకం" అని టీవీ5 మూర్తిగాడు.... సారి....మూర్తిగారు పదే పదే స్క్రొలింగ్ వేస్తూ మా బ్రతుకులతో ప్రొ కబడ్డీ ఆడుకొంటుంటే.... ఇంట్లో, అపార్ట్‌మెంట్లో, ఎక్కడపడితే అక్కడ జనాల చీదరింపు కంపు చూపులు.... తల్చుకుంటేనే "అపరిచితుడు"లో విక్రంగాడేసే శిక్షలకంటే కోటిరెట్లు టార్చర్‌గా వుంది. నా మైండ్ రీడ్ చేసినవాడిలా చందూగాడు, "ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మనల్ని పట్టించి టీవీలో చూపించినా.... నాకు ఫుల్ సూట్ ఉంటది కాబట్టి నా మొహం కనబడే చాన్స్ లేదు. నా బాధంత నీగురించే మామ" అని లేని రాని నటన ప్రదర్శించాడు.  

"ఒరేయ్ మహానుభావా, నీకొక దండం. బైక్ కనపడి చావట్లే వెతుకు" అని మొత్తుకున్నా. 
చందూ: మామ కీస్ నీ దగ్గరే వుండాలిరా.
నేను" బైకే లేదురా అంటే కీస్ అంటవ్" అని జేబులు తడుముకున్న. నిజంగనే కీస్ లేవు. "అంటే నా జేబులోనుంచిగాని లేక కిందపడితేగాని ఎవడోచూసి బైక్ తీసుకుపోయాడంటావా?" అని చందూగాడితో అంటే, వాడు, "యస్. కరెక్ట్. నువ్వు బాగా గుర్తుతెచ్చుకో. అక్కడ లేడీస్‌వైపు కన్నార్పకుండా నువ్వు చూస్తున్నప్పుడు జేబులోనుంచి ఏమో జారిపోయినట్లవ్వలేదా?" అన్నాడు.
నేను: ఒరేయ్ జీనియస్...దయచేసి నీ శాడిసం ఇప్పుడెందుకురా. నువ్వేనా తీసింది?
చందూ: చెప్తాకాని.... మనం వొచ్చినపనిమీదే లక్షముంచాలి. ఇది ఇందులోవున్న నీతి అర్థమైందా? కూరలకొచ్చి లేడీస్‌ని చూడటమేంట్రా?
నేను: అరేయ్ పంది, కత్తుంటే నిన్ను కస కసా పొడిచేద్దును. వాళ్ళు ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నారో చూసారా వెధవ. 
చందూ: స్టిల్ యూ ఆర్ రాంగ్. ఇదిగో కీస్, అదిగో బైక్ ఆ చెట్టెనక. పదరా మామ పోదాం.

టైం 4:30. ఇంకో అరగంటలో నేను వెయ్యిసార్లు చచ్చి బ్రతికినంత సంతోషం. ఇంటికిపొయ్యాక లాక్‌డవున్ ముగిసేవరకు చందూగాడి నంబర్ బ్లాక్. దేవుడా! ఇల్లుచేరేవరకు ఈ మహాదుష్టరాక్షసుడైన చందూగానివల్ల ఏమీజరుగకుండా చూడయ్యా అని మనసులోనే అనుకొని బైక్ స్టార్ట్ చేశా. 4:50- ఇల్లు చేరి చందూగానికి సాష్టాంగపడి, కరోనాకాలమైనా చందూగాడు "అమ్మా....  చెయ్యిరిగిందిరా.... నొప్పి.... వొదల్రా" అనేవరకు కసితీరా గట్టిగ షేక్‌హాండిచ్చి కాలుతో ఒకటిచ్చి పంపించా. అయినా సిగ్గులేకుండ వాడు, "మళ్ళెప్పుడురా? రేపు కలుద్దామా?" అంటుండగానే నేనదృశ్యమయ్యాను. 

30.03.2020 రాత్రి 10:30 నిద్రముంచుకొస్తుంది. చందూగాడు లేడన్న ధీమాతో ప్రశాంతంగా దుప్పటికిందకి దూరాను. 31.03.2020 దయ్యాలు తిరిగే టైం 2:30, హహాకారాలతో నిద్రలేచా. నా  సౌండ్‌కి కళాకూడా లేచింది. ఫుల్ ఏ సి లో కూడా తడిసిముద్దైపోయాను. "ఏమైంది సుధీర్, ఏమైనా పీడ కలా?" అంది తను. "అవును. చందూగాడు నవ్వుతూ కనపడ్డాడు" అన్నాను. "నవ్వితే పీడకలేటి? సర్లే పడుకో, రేపు చందూ అన్నని రమ్మంటా" అని అంది కళ....విన్ననాకు అప్పుడే తెల్లారింది. టైం 3:00.